కాళోజి కళా క్షేత్రం వద్ద హాఫ్ మారథాన్ ను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి….
గ్రేటర్ న్యూస్,హనుమకొండ: రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం హనుమకొండలోని కాళోజి కళా క్షేత్రం వద్ద వరంగల్ ట్రైసిటీ హాఫ్ మారథాన్-2025 పోటీలను మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. నాయిని విశాల్ ఫౌండేషన్, క్రెడాయి వరంగల్, తెలంగాణ రన్నర్స్, కియాన్ ఇన్ఫ్రా సంయుక్త ఆధ్వర్యంలో ఈ మారథాన్‌ను నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ…
* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను రాణించేలా ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీహరి తెలిపారు.
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.
* ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాష్ట్రంలోనే 4వ క్రీడా పాఠశాలను కేటాయించినట్లు ప్రకటించారు.
* యువత మత్తును వదిలిపెట్టి మైదానాలకు చేరాలని సూచించారు.
* అంతర్జాతీయ కోచ్‌లను తీసుకువచ్చి విద్యార్థులను, యువతను తీర్చిదిద్దుతున్నామని, ఇక్కడి నుండే క్రీడాకారులను దేశానికి, అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
* మారథాన్ నిర్వహణతో జిల్లా ఖ్యాతి రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు.
విజయ డెయిరీకి పూర్వ వైభవం..
* విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి శ్రీహరి ఈ సందర్భంగా ప్రకటించారు.
* దాదాపు 35 కోట్ల రూపాయలతో విజయ డెయిరీని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…మారథాన్ నిర్వహణతో జిల్లాకు మంచి పేరు వచ్చిందని, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్లేయర్, మంత్రి వాకిటి శ్రీహరి రంజీ ప్లేయర్ అని గుర్తుచేశారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు దోహదపడతాయని అన్నారు.
పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... చారిత్రక వరంగల్ నగరంలో మూడు వేల మందితో మారథాన్ నిర్వహించడం గర్వకారణమని అన్నారు.
* ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి (వరంగల్ పశ్చిమ), రేవూరి ప్రకాష్ రెడ్డి (పరకాల), కెఆర్ నాగరాజు (వర్ధన్నపేట),మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్,మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంధాలయ చైర్మన్ అజీజ్ ఖాన్,నిర్వాహకులు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్రంలోని జిల్లాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అథ్లెట్లు 5, 10, 21 కె రన్ మారథాన్‌లో పాల్గొన్నారు.







