ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి విక్రయాలను పరిశీలించిన కలెక్టర్ డా. సత్య శారద…

గ్రేటర్ న్యూస్, వరంగల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి క్రయ విక్రయాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గురువారం పరిశీలించారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న పత్తి లావాదేవీలను, క్రయవిక్రయాలను ప్రత్యక్షంగా చూసిన అనంతరం మార్కెట్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో నేరుగా పత్తి ధర, మార్కెట్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.భారీ వర్షాల కారణంగా ఏనుమాముల మార్కెట్ యార్డ్‌లో పత్తి తడిసిందని ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా, రైతుల నుండి ట్రేడర్లు కొనుగోలు చేసిన తదుపరి పత్తి తడిసిందని, రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు.
రైతులకు నష్టం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, పత్తి గింజలు, బళ్ళు వర్షానికి తడవకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, తగినంత తార్పాలిన్లు (తాత్కాలిక కవర్లు) ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ యార్డ్ అధికారులు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆమె స్పష్టం చేశారు.

తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులకు సూచించారు.

పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగించాలని, రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షాల కారణంగా తడిసిన పత్తి నాణ్యతను దృష్టిలో ఉంచుకొని రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్యక్షులు రవీందర్ రెడ్డి, మార్కెట్ అంజిత్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *