కార్తీక పౌర్ణమి సందర్బంగా భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ఘనంగా జ్వాలాతోరణోత్సవం….

హాజరైన నగర మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ రాష్ట్ర యూత్ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు….

గ్రేటర్ న్యూస్, వరంగల్ : భారతదేశం నలుమూలాల శంకరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పేరొందిన 12 మహాశైవ క్షేత్రాలతో పాటు పంచభూత లింగాలుగా, పంచారామాలుగా దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో పంచశైవ క్షేత్రాలు చరిత్ర ప్రసిద్ధిగాంచినవి. ఈ పంచశైవ క్షేత్రాలు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలలో వేరువేరు ప్రాంతాలలో ఉండగా తెలంగాణలో ఒకే ఒక మహానగరంలో స్వయంవ్యక్తమైన ఈ పంచభూత లింగ క్షేత్రాలు నెలకొన్ని వున్న క్షేత్రాలు కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన నగరం వరంగల్ మహానగరం..

1) వరంగల్ కోటలోని శ్రీ స్వయంభూలింగేశ్వర స్వామి (శంభులింగేశ్వరస్వామి దేవాలయం)- వృథ్వీ లింగం

2) మటియా వాడ (మట్టెవాడ)లోని శ్రీ భోగేశ్వరస్వామి దేవాలయం
జలలింగం

3) భద్రమ్మగుట్ట భద్రకాళీ ఆలయంలోని శ్రీ భద్రేశ్వరస్వామి
తేజో లింగం (అగ్నిలింగం)

4) హనుమకొండలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవాలయం
వాయు లింగం

5)మెట్టుగుట్ట(హిడింబాశ్రమం)నందుగల శ్రీ మెట్టురామలింగేశ్వరస్వామి
ఆకాశలింగం

పై పంచమహాశైవ క్షేత్రాలు కలిగివున్న ఈ వరంగల్ నగరం యొక్క గొప్పతనాన్ని పవిత్రతను వర్ణించడానికి భాష సరిపోదని సద్గురు శ్రీ శివానందమూర్తి పలుపర్యాయాలు తమ అనుగ్రహ భాషణంలో భక్తులకు తెలియజేసేవారు. అలాంటి పంచమహా శైవ క్షేత్రాలలోని పరమపవిత్రమైన తేజోలింగమూర్తి శ్రీ భద్రేశ్వరస్వామివారి సన్నిధానమునందు (వరంగల్ భద్రకాళీ దేవస్థానంలోని శివాలయంలో) శైవాగమ ప్రవర్తకులు శివశ్రీ ముదిగొండ ధీరజారాధ్యులవారి నేతృత్వంలో బుధవారం సాయంకాలం వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి హోమం నిర్వహించారు. అనంతరం జ్వాలాతోరణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ జ్వాలాతోరణ దర్శనం వల్ల మనుష్యుడు సకల పాపముల నుండి విముక్తుడై సకలైశ్వర్యములతో వర్ధిల్లుచూ దేహాంతమునందు అగ్నిజ్వాలల తోరణములతో నుండే యమలోకాన్ని దర్శించడని పురాణాలు చెబుతున్నాయి. వందలాది భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించి సమస్త పాపాలు తొలగిపోయి పునీతులవయ్యాము అన్న భావనతో ఒక దివ్యానుభూతిని పొందారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తమతమ ఇళ్ళకు వెళ్ళారు.అనంతరం దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడింది. దేవాలయం సందర్శించిన ముత్తైదువులకు వాయినాలు మేయర్ గుండు సుధారాణి, ఆలయ ఈ.ఓ రామల సునీత అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి, దేవాలయ ధర్మకర్తలు తానుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, అనంతుల శ్రీనివాసరావు, కటకం రాములు, లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షులు జి.కృష్ణారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *