25 Feb 2026, Wed

చిన్నపిల్లలను కిడ్నాప్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్…

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : నగరంలో చిన్నపిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న నిందితులను కాజిపేట్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులైన 1) కొడుపాక నరేష్ వయస్సు 42 సంవత్సరాలు గ్రామం ఘవాపూర్ గ్రామం, పెద్దపల్లి జిల్లా  2) వెల్పుల యాదగిరి, వయస్సు 32 సంవత్సరాలు, నివాసం శాంతినగర్, పెద్దపల్లి టౌన్, పెద్దపల్లి జిల్లా కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ

గత డిసెంబర్ నెల 28వ తేదీన తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడైన 5 నెలల వయసున్న మల్లన్న అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటనలో బాలుడి తండ్రి కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.ఇట్టి కేసు దర్యాప్తులో భాగంగా కాజిపేట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారించగా నేరాస్థలం లో లభించిన ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ఇద్దరు ఈ రోజు ఉదయం అద్దెకు తీసుకున్న కారులో మళ్ళీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో అనుమనస్పదంగా కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫూట్ పాత్ వద్ద రెక్కి నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను కాజీపేట పోలీసులు పట్టుకొని విచారించగా వాళ్లు 28 డిసెంబర్, 2025 రోజున కిడ్నాప్ చేసిన 5 నెలల బాబు కిడ్నాప్ తో పాటుగా గతంలో నలుగురు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా ఒప్పుకున్నారని తెలిపారు. ఇట్టి పిల్లలను వీళ్ళు పిల్లలు కలగలేని దంపతులకు అనాధాశ్రమాల నుంచి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా నమ్మబలికి డబ్బులకు అమ్ముకున్నారని అదేవిధంగా 28 డిసెంబర్, 2025 రోజున కిడ్నాప్ చేసిన ఐదు నెలల బాబుని జన్నారం మండలం లింగయ్యపల్లీ గ్రామంలో, ఇదే విదంగా గతంలో ఇద్దరు నిందితులు కిడ్నాప్ చేసిన నలుగురు పిల్లల్లో 2025 ఆగస్టు లో వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫాం పైన తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను మంచిర్యాల జిల్లా నస్పూర్ లో, 2023 అక్టోబర్ నెలలో కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడు సంవత్సరాల బాబును జన్నారం మండలంలో, 2025 అక్టోబర్ నెలలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిదురిస్తున్నటువంటి 05 నెలల పాపను మంచిర్యాలలో, 2025 జూన్ నెలలో రామగుండం రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను జగిత్యాల జిల్లాలో అమ్మినారని తెలిపారు. ఇట్టి నేరస్తుల నేర ఒప్పుకోలు ఆధారంగా కాజీపేటలో అపహరణకు గురైన ఐదు నెలల బాబు మల్లన్నతో పాటుగా మిగతా నలుగురు పిల్లలను రెస్క్యూ చేయడం జరిగిందని అదేవిధంగా ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండా కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని సీపీ తెలిపారు.

చిన్నపిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేసారు.

ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్, కాజీపేట ఏసీపీ లు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, కాజీపేట ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది తో పాటు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *