గ్రేటర్ న్యూస్,మహబూబాబాద్ : జిల్లా పరిధిలో నిషేధిత చైనా మాంజా విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. శబరీష్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాల ఎగరవేతకు యువత సిద్ధమవుతున్న తరుణంలో, ప్రమాదకరమైన చైనా మాంజా వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకే ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి కలిపిన దారం) వినియోగం వల్ల పక్షుల మెడలు, రెక్కలు కోసుకుపోవడం, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడటం, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని ఎస్పీ వివరించారు. ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారిన ఈ నిషేధిత మాంజాను ఎవరైనా విక్రయించినా లేదా వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.చైనా మాంజా విక్రయం లేదా వినియోగంలో పాల్గొన్నవారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. నిషేధిత మాంజా నిల్వలు, విక్రయాలపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రజలు చైనా మాంజాను పూర్తిగా నివారించి, ప్రభుత్వ అనుమతితో ఉన్న కాటన్ దారాలతో మాత్రమే గాలిపటాలు ఎగరవేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను ఎస్పీ కోరారు.
చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా జైలు తప్పదు…మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్

