అభివృద్ధి పనుల్లో శూన్యం – అసత్య ప్రచారాల్లో ప్రథమం..
మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే నాయిని తీవ్ర విమర్శలు..
గ్రేటర్ న్యూస్,హనుమకొండ : పదేళ్లలలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అభివృద్ధి పనుల్లో శూన్యం అసత్య ప్రచారాల్లో ప్రధమమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులపై ఎమ్మెల్యే నాయిని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.డబ్బు కోసం చేసే రాజకీయాలకే బీఆర్‌ఎస్ పరిమితమైందని అన్నారు.పదేళ్ల పాలనలో అభివృద్ధిని కుంటుపడేసి, ఇప్పుడు విమర్శలనే ఆయుధంగా చేసుకుని జిల్లాల్లో జెమిని సర్కస్ మాదిరిగా పర్యటనలు చేస్తున్నారని అన్నారు. చేసిన పనులు లేకపోవడంతో రోజువారీ ఆరోపణలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.మూడు రోజులుగా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచిస్తోందని పదేళ్లలో చేయలేని వారు ఇప్పుడు పరిశీలన పేరుతో మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. దాదాపు పూర్తికావొచ్చిన దవాఖానను బయట నుంచే చూసి విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక పరికరాలు విదేశాల నుంచి రానున్నందున కొంత జాప్యం సహజమని వివరించారు.వరంగల్ మాజీ నేతలకు ఎమ్మెల్యే సూటి ప్రశ్నలు సంధించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించినప్పుడు కానీ, నిధుల కేటాయింపుల విషయంలో కానీ మీ నాయకులను ఎప్పుడైనా ప్రశ్నించారా? మీ కాలంలో జరిగిన అభివృద్ధి ఎంత, గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఎంత అనే అంశంపై చర్చకు సిద్ధమా?” అని సవాల్ విసిరారు.బినామీ పేర్లతో కోట్ల రూపాయలు కూడబెట్టిన నేతలు ఇప్పుడు పారదర్శకతపై మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. టెక్స్టైల్ పేరుతో అట్టహాసంగా ప్రకటించిన ప్రాజెక్టులు భూమి దశ దాటలేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని, రెండున్నరేళ్లలో తీసుకొచ్చిన పనులు ఎటువంటి అవకతవకలు లేకుండా సాగుతున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లపై కమిషన్ల ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. “సలహాలు ఉంటే ఇవ్వండి. ఎన్నికల వరకు రాజకీయాలు చేద్దాం. కానీ దాడుల రాజకీయాలను నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదు” అని అన్నారు.పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్నికల సమయంలో తప్పకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి.మీ ఓటు హక్కు వినియోగించుకోలేని పక్షంలో గూండాలు రౌడీలు రాజ్యమేలుతారని చదువుకున్న విజ్ఞవంతులుగా మీరు సరైన సమయంలో రానున్న ఎన్నికల్లో నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ప్రజల తీర్పే తుది తీర్పు అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు ,కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్,జిల్లా RTA మెంబెర్ పల్లకొండ సతీష్,ఆలయ కమిటీ డైరెక్టర్ సతీష్,బ్లాక్ అధ్యక్షులు బంక సంపత్,లక్ష్మారెడ్డి,నాయకులు నలుబోల సతీష్,సుగుణాకర్ రెడ్డి,తడుక సుమన్,పున్నం,నాగరాజు,కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


