గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5025 కేసులు పరిష్కారమయ్యాయని, సైబర్ క్రైమ్ కేసుల్లో 89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన మొత్తం కేసుల్లో కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు -1011, ఈ పెట్టి కేసులు -1281, డ్రంకెన్ అండ్ డ్రైవ్ , మోటార్ వెహికల్ చట్టం కేసులు-2533, సైబర్ కేసులు -200 పరిష్కరించడం ద్వారా బాధితులకు సంబంధించి వివిధ బ్యాంక్ ఖాతాల్లో నిలుపుదల చేసిన 89,43,506 రూపాయలు బాధితులకు అందజేశాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు వెలుబడించిందని తెలిపారు.రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించి కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.అదేవిధంగా లోక్ అదాలత్ సద్వినియోగం సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయసేవాధికారులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
పొగమంచు కారణంగా రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి…
వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్…
వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగటంతో వీలైనంత వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయద్దని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు.వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటన చేస్తూ. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించడం, వీక్షించే సామర్ధ్యం తక్కువుగా వుంటుందని ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోగలరని వరంగల్ సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అలాగే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీపీ సూచింస్తూ….వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనదారులు శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలన్నారు.తక్కువ వీక్షించే సామర్ధ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు.అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవంతో పాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని అన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని సూచించారు. పోలీసుల సూచనలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే ప్రధాన లక్ష్యమని సీపీ వెల్లడించారు.

