గ్రేటర్ న్యూస్, హనుమకొండ : ప్రజల ఆరోగ్యం విషయంలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ అన్ని విధాలుగా సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారం బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 81 మంది లబ్ధిదారులకు రూ.25,86,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే నాయిని స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యం విషయంలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారికి రాజకీయాలు, పార్టీ భేదాలు ఏమాత్రం అడ్డుకావని, సహాయం కోసం వచ్చిన ప్రతి అర్హుడికి సీఎం సహాయనిధి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
గత పాలకుల కాలంలో సహాయ నిధుల కోసం దళారీ వ్యవస్థ రాజ్యమేలిందని, ప్రజలు చెక్కు పొందాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితికి పూర్తిగా తెరదించామని చెప్పారు. ఎవరికీ నయా పైసా ఖర్చు లేకుండా, నేరుగా లబ్ధిదారుల చేతుల్లోకి చెక్కులు అందే విధంగా వ్యవస్థను సులభతరం చేశామని పేర్కొన్నారు.
ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వేగంగా పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్క అర్హుడూ సహాయం లేకుండా మిగలకుండా చూస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

