ఫోన్ ద్వారా అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే నాయిని …
గ్రేటర్ న్యూస్,హనుమకొండ :మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణ పలు జిల్లాలను ప్రభావితం చేస్తున్న క్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయిని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలులు, వాతావరణ మార్పులు నమోదవుతున్నాయని ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరమని అన్నారు.అత్యవసరమైన పనులు తప్ప బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అందరూ ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించి, అవసరమైన చోట సహాయక చర్యలు తీసుకునేలా తగు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే నాయిని సూచించారు.చలికాలం ప్రారంభమవుతున్న ఈ సమయంలో వాతావరణంలో మార్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి నిల్వల దగ్గర, విద్యుత్ తీగల దగ్గర, పాత చెట్ల సమీపంలో వెళ్లకూడదు. అవసరమైతే స్థానిక అధికారులను సంప్రదించాలి అని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.అత్యవసర ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కూడా సహాయం చేయాలని ఎమ్మెల్యే నాయిని పిలుపునిచ్చారు.

