నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు…
గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ :జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ…పీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయని ఈ గెలుపు కార్యకర్తలకు అంకితమని అన్నారు.ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల, ఇక్కడ పేదల సంక్షేమం పట్ల మా బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.రెండేళ్లుగా నగరాభివృద్ధికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి మా ఆలోచన, విజన్, కార్యచరణకు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఆమోదం తెలిపారు.వచ్చే మూడేళ్లు ఆ దిశగా నిరంతరం పని చేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు మాకు సరికొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయన్నారు.ఎన్నికలప్పుడే రాజకీయం. వచ్చే మూడేళ్లు అభివృద్ధి, పేదల సంక్షేమమే మా మంత్రమని జూబ్లిహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక మా బాధ్యత అని అన్నారు.


