తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి
జిల్లా అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ…
గ్రేటర్ న్యూస్,వరంగల్: భారీ వర్షాల కారణంగా వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో… క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు , ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.బుధవారం మంత్రి వరంగల్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ తో జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల… రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డి ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని అధికారులకు సూచించారు.జిల్లాల్లోని అన్ని చెరువులు నిండి ఉన్నందున, ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా పునరావస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తహసిల్దారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జలమాయమయ్యే ప్రాంతాలలో నిర్వాసితులైన ప్రజలకు భోజనం, వృద్ధులకు పండ్లు, పిల్లలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలన్నారు.చెరువులు నిండి వంకలన్నీ ఉధృతంగా ప్రవహించనున్న నేపథ్యంలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు తమ మండల పరిధిలోని లు గ్రామాలు జల మాయమయ్యే ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉద్ధృతితో రోడ్లు తెగిపోయిన ఉదృతంగా ప్రవహించిన ఆయా ప్రాంతాల్లో ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని బారీ గేట్లు, ఇతర పరికరాలు ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు.వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుందని, కావున రోడ్డు రవాణా విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, విద్యుత్, రోడ్ల భవనాల శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.నీటిపారుదల శాఖ అధికారులు చెరువులు, కుంటలు లోని నీటిమట్టలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ క్లోరినేషన్ చేపట్టాలన్నారు.నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు.భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పారిశుద్ధ్య ఆరోగ్య సమస్యల పరంగా మరింత క్లిష్టమైనవని, అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ముంపు సమస్యలపై శ్రద్ధ వహించాలన్నారు.
ఏమైనా అత్యవసర పరిస్థితులను తన దృష్టికి గాని జిల్లా కలెక్టర్ల దృష్టికి గాని తీసుకురావాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.
అత్యవసర సహాయం కొరకు ప్రజలు వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టరేట్ 1800 425 3424, 9154225936, 1800 425 1115 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 1800 425 1980, 9701999676 , విద్యుత్కు సంబంధించిన సమస్యలను పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 1800 425 0028 ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని మంత్రి కొండా సురేఖ కోరారు.

