నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి…కలెక్టర్ స్నేహ శభారీష్

ఎల్కతుర్తి, దామెర, గోపాల్ పూర్ క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శభారీష్

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కు సంబంధించి పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ ల స్వీకరణ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శభారీష్ అన్నారు.హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలు అయిన ఎల్కతుర్తి, దామెర, గోపాల్ పూర్ గ్రామపంచాయతీ కార్యాలయాలలో క్లస్టర్ల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గురువారం కలెక్టర్ పరిశీలించారు.ఎల్కతుర్తి గ్రామపంచాయతీ కార్యాలయం( క్లస్టర్) నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఎల్కతుర్తి, బావుపేట, ఆరెపల్లి గ్రామాలు, దామెర గ్రామపంచాయతీ కార్యాలయం క్లస్టర్ నామినేషనన్ల స్వీకరణ కేంద్రం వద్ద దామెర, చింతలపల్లి, ఇందిరా నగర్ గ్రామాలు, గోపాల్ పూర్ గ్రామపంచాయతీ కార్యాలయం నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద గోపాల్ పూర్, కోతుల నడుమ, శాంతి నగర్, వల్బాపూర్ గ్రామాల సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఎలక్షన్ నోటీస్, ఓటర్ల జాబితా, హెల్ప్ డెస్క్లను కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంసీ సీ నోడల్ ఆఫీసర్ ఆత్మారాం, జడ్పీ సీఈవో రవి, ఎల్కతుర్తి తహసిల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీఓ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు ఈ నెల 27,28, 29 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 29న నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు. 30వ తేదీన నామినేషన్ల స్క్రూట్ని, డిసెంబర్ మూడో తేదీన నామినేషన్ల ఉపసంహరణ, ఇదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా, డిసెంబర్ 11న ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు, డిసెంబర్ 11 తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికైన అభ్యర్థుల ప్రకటన ఉంటుంది.

గోపాల్ పూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మీడియాతో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ

హనుమకొండ జిల్లాలో మొదటి విడతలో నేడు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 210 గ్రామపంచాయతీలు, 1986 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడత మండలాల్లో క్లస్టర్ల వారిగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న భీమదేవరపల్లి ఎల్కతుర్తి కమలాపూర్ మండలాల్లో 24 క్లస్టర్లు ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 74 క్లస్టర్లు ఉన్నట్లు చెప్పారు. క్లస్టర్ల వారీగా నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి ఎఫ్ ఎస్ టి బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో స్టాటిక్ సర్వేలెన్సు టీమ్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఎలాంటి రాజకీయ పార్టీల హోర్డింగ్ లు, బ్యానర్లు, గోడ ప్రతులు, రాతలు ఉండకూడదని, ప్రైవేట్ స్థలాల్లో ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఉండవని అన్నారు. ఎన్నికల రోజునే వార్డు మెంబర్, సర్పంచుల ఓట్ల కౌంటింగ్ ఉంటుందని, కౌంటింగ్ తదుపరి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఉప సర్పంచ్ ఎన్నిక తర్వాతి రోజు ఉంటుందన్నారు. 210 గ్రామపంచాయతీలలో 52 గ్రామపంచాయతీలను సమస్యాత్మక జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు అదనంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించినట్లు తెలిపారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *