గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అధికారులకు ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమీషనర్ శనివారం కాజీపేట ఏసీపీ కార్యాలయంలో తనిఖీ చేశారు.ఉదయం కార్యాలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ కు కార్యాలయ సిబ్బంది అధికారులు పూల మొక్కను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ కమీషనర్ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్పెషల్ గ్రేవ్,ఎస్టీ. ఎస్సీ, పెండింగ్ కేసులతో పాటు, కార్యాలయం సంబంధించిన పలు రికార్డులను పోలీస్ కమీషనర్ పరిశీలించారు. చివరగా కాజీపేట డివిజన్ పోలీస్ అధికారులతో సిపి మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించే వారిపై అలసత్వం వహించవద్దని సీపీ అధికారులకు సూచించారు.ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, కాజీపేట ఏసీబీ ప్రశాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు పుల్యాల కిషన్, సుధాకర్ రెడ్డి, చేరాలు, శ్రీధర్ రావు, పులి రమేష్ , సిబ్బంది పాల్గొన్నారు.


