గ్రేటర్ న్యూస్,వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించబడ్డాయని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుండి ఈ రోజు వరకు మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అభ్యర్థులు,ప్రజలతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు గాను డిసిపి నుండి హోగార్డ్ స్థాయికి చెందిన వారు మొత్తం 2వేలకు పైగా పోలీసులు విధులు నిర్వహించారని, ఎన్నికల తేదీలు ఖరారైన నాటి నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠినముగా ఎన్నికల నిబంధనలను అమలు చేయడం జరిగిందన్నారు.ఇందులో భాగంగా కమీషనరేట్ పరిధిలో మొత్తం ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరిగిందని సీపీ తెలిపారు. అలాగే గ్రామాల్లోను ముమ్మరంగా తనిఖీ నిర్వహించడం ద్వారా నేటి వరకు 6లక్షల74వేల రూపాయలతో పాటు,128 కేసుల్లో సుమారు 12లక్షల42 వేల రూపాయల విలువ గల మద్యం సీసాలు, 49కేసుల్లో ఒక లక్ష 27వేల రూపాయల విలువగల 343 లీటర్ల గుడుంబాతో పాటు ఒక లక్ష 23వేల రూపాయల విలువ గంజాయిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు.ఎన్నిక సందర్బంగా లైసెన్స్ కలిగి వున్న మొత్తం 156 తుపాకులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గతంలో ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు రౌడీ షీటర్లు, అనుమానస్పద వ్యక్తులకు సంబంధించి 432 కేసుల్లో మొత్తం 2,638 మందిని బైండోవర్ చేయడం జరిగిందని సీపీ పేర్కోన్నారు.

