Breaking
25 Mar 2026, Wed

“ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ప్రధాన బాధ్యత”– వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత అని వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ తెలిపారు.రోడ్డు ప్రమాదాలను నివారణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్యలలో భాగంగా, “అరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమాన్ని నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం కాజీపేట రైల్వే ఆడిటోరియంలో వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ…ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వలన జరిగే ప్రమాదాలను నివారించాలని సూచించారు. ప్రయాణికుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని వాహనం నడపాలని, మితిమీరిన ప్రయాణికులను ఎక్కించకూడదని తెలిపారు.అలాగే, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రతి డ్రైవర్ రోడ్డు నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ముఖ్యమైన సూచనలు అందించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, జీబ్రా క్రాసింగ్ వద్ద జాగ్రత్తలు తీసుకోవడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతపై తమ బాధ్యతను గుర్తించి, నిబంధనలు పాటిస్తామని ఆటో డ్రైవర్లు ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్ కాజీపేట ఏసీపీలో సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత తో పాటు కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *