రూ.5257 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి పరిపాలన అనుమతి..
బాణసంచా పేల్చి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు..
జిల్లా ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన నేతలు..
గ్రేటర్ న్యూస్,హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు , వరంగల్ మేయర్ గుండు సుధారాణి ,డిసిసి అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ….
ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలు మార్చే అతిపెద్ద ప్రాజెక్ట్ UGD – ఇది ఒక్కరి కృషి కాదు, ప్రజల ఆశీస్సులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషి ఫలితమని తెలిపారు. గతంలో ఎంతోమంది నాయకులు రాజకీయ స్వలాభాల కోసం మాత్రమే పనిచేశారని, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రజలను నిరాశపరిచారని విమర్శించారు.
వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని గత పాలకులు ఎన్నోసార్లు చెప్పినా ఆచరణలోకి తీసుకురాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు.
వరంగల్ త్రినగరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం ఏర్పాటు, నగర మాస్టర్ ప్లాన్ అమలు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.5257.20 కోట్ల నిధులను కేటాయిస్తూ జీఓ నెంబర్ 322 ద్వారా పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైందని, క్షేత్ర స్థాయిలో ప్రముఖ సంస్థ ద్వారా పూర్తి ప్రణాళికతో తయారు చేయించినట్లు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే అనేక కీలక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు వేగంగా భూసేకరణ చేపట్టి రూ.309 కోట్లకు పైగా నిధులు కేటాయించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసి భూములను సేకరించి ఫ్యాక్టరీ నిర్మాణానికి కేటాయించినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అనేక హామీలను గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయలేకపోయాయో చెప్పాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మొద్దు నిద్రలో ఉండి ఇతరులు చేసిన పనులను తామే చేసినట్టు చెప్పుకుంటుందని విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక చట్టాలకు ముందుండి మద్దతు ఇచ్చిన ఘనత కూడా అప్పటి పాలకులదేనని అన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత కాలపట్టికతో అమలు చేసి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించడం వల్ల అభివృద్ధి కొంత వెనుకబడిందని వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీల నాయకులు చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. గత పదేళ్లలో వారు తెచ్చిన నిధులు ఎన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో తెచ్చిన నిధులు ఎన్ని అన్నది ప్రజల ముందు చర్చించేందుకు సిద్ధమని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో ఏ టెండర్ ప్రక్రియలోనూ అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కమిషన్ల కోసం పనులను ఆలస్యం చేసే పరిస్థితి తమ పాలనలో లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు వారికి జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వాలు జీఓలను పాంప్లెట్‌ల మాదిరిగా జారీ చేశాయని, కానీ తమ ప్రభుత్వం జారీ చేసిన ప్రతి జీఓ అమలు అయ్యేలా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.
జిల్లా ప్రజల ఆశీస్సులతో కేవలం రెండేళ్లలోనే ఇంత అభివృద్ధి సాధ్యమైందని పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు మంత్రులకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం కాంగ్రెస్ శ్రేణులు అందరూ హనుమకొండ జిల్లా కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

