గ్రేటర్ న్యూస్,కాజీపేట: ఫాతిమా నగర్ నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను బుధవారం రోజున సంబంధిత రోడ్లు భవనాల (R&B) శాఖ అధికారులతో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, పనులను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ… మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాకు ఈ ROBను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిధులను సత్వరమే మంజూరు చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. అయితే అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పనుల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నట్లు చెప్పారు.ప్రధానంగా ఈ బ్రిడ్జి రైల్వే శాఖ పరిధిలో ఉండటం, నిర్మాణానికి అవసరమైన భారీ పరికరాలు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సి రావడం వల్ల ఆలస్యం జరిగిందని వివరించారు. అయినప్పటికీ రైల్వే అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.రానున్న అతి కొద్ది కాలంలోనే కాజీపేట ROB నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. మేడారం జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, వారికి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.నగర నలువైపులా ఉన్న బ్రిడ్జిల పనులను వేగంగా పూర్తి చేయడానికి ఎమ్మెల్యేలందరం సమిష్టిగా కృషి చేస్తున్నామని, ప్రజల సౌకర్యమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి నిట్ కాలేజీ నుంచి హంటర్ రోడ్డు వరకు రోడ్డు వెడల్పు ప్రక్రియను ప్రారంభించామని, ఈ పనులు పూర్తైతే నగరంలో రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే నాయిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.



