గ్రేటర్ న్యూస్,వరంగల్ : జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి సరైన శిక్షణ ఎంతో కీలకమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.ఆదివారం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరం (కంప్యూటర్ ల్యాబ్)లో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జనగణన–2027 నిర్వహణపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఛార్జ్ సెన్సస్ క్లర్కులు,టెక్నికల్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహనతో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.
జనగణన ద్వారా ప్రభుత్వానికి అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు అందుతాయని, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి సరైన వివరాలను సేకరించడం సిబ్బందిపై ఉన్న ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి విధివిధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. విధుల్లో నిబద్ధతతో పనిచేసి జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సెన్సస్ అధికారి (డీఆర్ఓ) విజయలక్ష్మి, ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ, వరంగల్ ఆర్డీఓ సుమ, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సంబంధిత అధికారులు (ఎంపీఎస్వోలు), టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

