గ్రేటర్ న్యూస్, హనుమకొండ: మానవ మనుగడకు నీరు అనేది ప్రాణాధారమని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.ఆదివారం అంతర్జాతీయ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవేంద్ర అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి అనసూయ సీతక్క తో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ…
ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోకపోతే రానున్న రోజుల్లో మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగా ప్రపంచ నీటి దినోత్సవాన్ని నేడు జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకున్నప్పుడే భావి తరాలకు నీటి ఇబ్బందులు ఏర్పడవని పేర్కొన్నారు. భూగర్భ
జలాలు పెరిగేందుకు ప్రతి ఒక్కరూ తమ
ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇంకుడు
గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విచ్చలవిడిగా నీటిని వృధాచేయడం వల్ల నీటిని కొనుక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. చెట్లు పెంచని పక్షంలో రానున్న రోజుల్లో గాలిని సైతం కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలకు సమీపంలోని చెరువులను కాపాడుతూనే అడవులను కాపాడుకోవాలని, సూచించారు. గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. వాటర్ ప్లాంట్ల పై ఆధారపడకుండా గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న శుద్ధమైన నీరు వినియోగంపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా పంటలకు అధిక రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారని, వాటి వినియోగాన్ని తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. రసాయనిక ఎరువులు వినియోగం పెరగడంతో క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అన్నారు.
ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ….
గ్రామాలలో మిషన్ భగీరథ నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవనానికి మూలాధారమైన పంచభూతాలైన గాలి నీరు నిప్పు ఆకాశము భూమిని ఇంత పరిశుభ్రంగా ఉంచితే మనతోపాటు భవిష్యత్ తరాలకు అంతా మేలు కలుగుతుందన్నారు. రాబోయే తరాలకు పర్యావరణం పంచభూతాలను పరిరక్షించుకోవాల్సిన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. విలువైన నీరును వృధా చేయవద్దని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అన్నారు. నీటిని పొదుపుగా వాడుతూ భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ…
జిల్లాలోని గ్రామాలకు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ ఇచ్చి శుద్ధమైన నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లోనూ గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మిషన్ భగీరథ ద్వారా పంపిణీ చేస్తున్న శుద్ధ నీరు, ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుండి వినియోగించే నీరు గురించి అధికారులు డెమో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, స్థానిక తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.





