25 Feb 2026, Wed

ప్రపంచ చరిత్రలో ప్రత్యేక మైలు రాయిగా మేడారం ఆలయం నిలుస్తుంది… మంత్రి సీతక్క

వన దేవతల ఘన కీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలి

మేడారం అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ


గ్రేటర్ న్యూస్, ములుగు / మేడారం : వన దేవతల ఘన కీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలని,గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గొట్టు గోత్రాలు ఆచారాలు ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతున్నదని, ప్రపంచానికి ఆదివాసులు మూల పురుషులుగా ఉన్నారని, మేడారం అభివృద్ధి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

శుక్రవారం ఎస్.ఎస్.తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, లతో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ….

తెలంగాణ ప్రజా ప్రభుత్వం 251 కోట్ల రూపాయల నిధులతో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.మేడారం జాతర లో శాశ్వత ప్రతిపాదికన జరుగుతున్నా అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ అంశాలు ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు.భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, ఇంటి ఇలావేల్పులుగా సమ్మక్క సారలమ్మ దేవతలు ప్రసిద్ధి చెందారని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగులలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవ వందనంతో గిరిజన నృత్యాల తో వన దేవతలు గద్దెల పైకి రావడం తో భక్త జనం భక్తి పారవశ్యం తో పులకరిస్తారని పేర్కొన్నారు.
ఈ మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
గద్దెల పునరుద్ధరన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని ,18వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారని, గద్దెల పునరుద్ధన ప్రారంభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఆలయ పునరుద్ధన విషయం లో గిరిజన పెద్దలతో, పూజారులతో, ఆదివాసి సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని , అందరి సమ్మతి, సంతకాలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.జాతర లో మహిళా సంఘాల సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి బొంగు చికెన్, ఇప్ప పువ్వు లడ్డు ప్రత్యేక దుకాణాలు పెట్టించడం జరిగిందని తెలిపారు.

అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతర నిర్వహించడం జరుగుతుందని, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.జాతర లో ప్రస్తుతం 5 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని , జాతర సమయం లో 30వేల మంది సిబ్బంది,జాతర అనంతరం 5 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.
జాతర ప్రాంతాన్ని 8 జోన్స్ గా, 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్ లో 8 మంది అధికారులు ఉంటారని అన్నారు.

తదనంతరం ములుగు జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ మాట్లాడుతూ… మేడారం జాతర సమయంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తాడ్వాయి – మేడారం ,పసర – మేడారం రహదారుల వెంట ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర నిర్వహణ కోసం సుమారు 20 మంది ఐపీఎస్‌ అధికారుల సేవలను వినియోగించుకుంటామని, భక్తులకు సేవలు అందించడానికి స్థానిక యువత సిద్ధంగా ఉన్నారని, వాహనాల పార్కింగ్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. జాతర పరిసరాలను 450 సీసీ టీవీ, 20 ప్రత్యేక డ్రోన్స్ నిఘా తో పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్ ద్వారా గద్దెల ప్రాంగణం లో భక్తుల రద్దీని పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 20కి పైగా డ్రోన్‌లను ఉపయోగిస్తూ, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వివరించారు. అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత హీట్‌ మ్యాప్‌ టెక్నాలజీ ద్వారా అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో జన సమూహ నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, వరంగల్ ములుగు మీడియా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *