Breaking
16 Jul 2026, Thu

సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతో మేడారం మహా జాతర విజయవంతం – మంత్రి సీతక్క…

గ్రేటర్ న్యూస్, ములుగు /మేడారం : సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ ఏడాది అత్యంత ఘనంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క తెలిపారు. కోట్లాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా తల్లులను ప్రశాంతంగా దర్శించుకోవడం ప్రభుత్వ యంత్రాంగం సాధించిన ముఖ్యమైన విజయంగా మంత్రి పేర్కొన్నారు. తల్లుల వన ప్రవేశం అనంతరం మేడారంలోని మీడియా సెంటర్ లో మంత్రి సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…
జాతర నిర్వహణకు ముందే రూపొందించిన సమగ్ర ప్రణాళికలు, స్పష్టమైన వ్యూహాలు, శాఖల మధ్య సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఫలించాయని తెలిపారు. రవాణా సౌకర్యాలు, వైద్య సేవలు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్‌, అగ్నిమాపక, పోలీస్‌ భద్రత వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్ల జాతరలో ఎక్కడ కూడ అంతరాయం లేకుండా సాగిందని చెప్పారు.
ఈ ఏడాది జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణాలను మరింత సౌకర్యవంతంగా, శోభాయమానంగా తీర్చిదిద్దడం వల్ల భక్తులకు మెరుగైన అనుభూతి లభించిందని తెలిపారు. గద్దెల పరిసరాల్లో విస్తరణ, పాదచారులకు సౌకర్యవంతమైన మార్గాలు, శాశ్వత మౌలిక వసతులు జాతర ప్రతిష్టను మరింత పెంచాయని అన్నారు.
ఈ అభివృద్ధి పనుల కారణంగా మేడారం మహాజాతరకు మరింత శోభ చేకూరిందని, సంప్రదాయం ఆధునిక సదుపాయాలు సమన్వయమై భక్తుల మనసును ఆకట్టుకున్నాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా చేపట్టిన ఈ పనులు మేడారం చారిత్రక ప్రాధాన్యతను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.
ఈ మహాజాతరను విజయవంతం చేయడంలో అహర్నిశలు కృషి చేసిన జిల్లా యంత్రాంగం, పోలీస్‌ శాఖ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సేవకులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి సీతక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

గుడి అభివృద్ధి పనులు ప్రారంభమైన నాటి నుండి కొన్ని శక్తులు పనికట్టుకుని దుష్ప్రచారం చేశాయని, జాతర సందర్భంగా కూడా సోషల్ మీడియా వేదికగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశాయని, వారి ప్రచారాన్ని తిప్పి కొట్టీ తల్లుల సేవలో భక్తులు తరించారని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో యుద్ధ ప్రాతిపదికన వంద రోజుల్లోనే మేడారం అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. మేడారం చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. మేడారం అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన మంత్రివర్గ సహాచరులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

భక్తుల సహనం, సహకారం వల్లే మేడారం జాతర ఇంత ఘనంగా విజయవంతమైందని పేర్కొంటూ, సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖ సంతోషాలు, సమృద్ధి కలగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *