పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని…
గ్రేటర్ న్యూస్, హనుమకొండ :పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…., ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చిన్నారుల ఆరోగ్య భద్రత కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
హనుమకొండ జిల్లాలో సుమారు 9,90,334 మంది జనాభా ఉండగా, ఐదు సంవత్సరాల లోపు 84,301 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లో 33,313 మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు.
ఈ చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 460 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీపంలోని పోలియో బూత్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో నిర్వహిస్తున్న పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే నాయిని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రామ్‌కుమార్,డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఈవి శ్రీనివాస్ రావు,సూపరెండెంట్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

