Breaking
26 Mar 2026, Thu

మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం… మంత్రి కొండా సురేఖ

  • మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
  • మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ

గ్రేటర్, న్యూస్, వరంగల్ : మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ తెలిపారు.శనివారం వరంగల్‌లోని సాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు, ముస్లిం మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ , వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద , జి డబ్ల్యూ ఎం సి నగర మేయర్ గుండు సుధారాణి  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఒకప్పుడు మహిళలను వంటింటికే పరిమితం చేసేవారని, కానీ నేడు ప్రపంచ ప్రగతికి మహిళలు రథచక్రాలుగా మారారని పేర్కొన్నారు.

మహిళా సాధికారత కోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని  అందుకు తానే ఒక ఉదాహరణనని మంత్రి సురేఖ తెలిపారు. ఒక మహిళగా తనకు ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం మహిళల ఎదుగుదలకు నిదర్శనమని అన్నారు.

మహిళల సంక్షేమం కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి సురేఖ తెలిపారు. గతంలో మహిళా సంఘాలు అంటే స్వయం ఉపాధి మాత్రమే ఉండేదని, కానీ ప్రజా ప్రభుత్వంలో మహిళా సంఘాలు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నాయని అన్నారు.

మహిళలను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతిలో భాగమని తెలిపారు. అందుకే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. దీంతో మహిళలు ఆదా చేసుకున్న డబ్బును ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కోట్లాది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.

మహిళలు కేవలం కుట్లు, అల్లికలకు మాత్రమే పరిమితం కాదని, వారు సంపద సృష్టికర్తలని మంత్రి సురేఖ అన్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 వరకు ఉంటే, తెలంగాణలో రూ.500కే అందిస్తున్నామని తెలిపారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ మహిళలపై ఆర్థిక భారం తగ్గిస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు సోదరుడిలా అండగా నిలుస్తూ ప్రజాపాలన అందిస్తున్నారని మంత్రి సురేఖ తెలిపారు. మహిళలు ఏ వ్యాపారం ప్రారంభించినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తి సమాన పనికి సమాన వేతనం అనే నినాదమని, లింగ వివక్షత లేకుండా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.రానున్న రోజుల్లో మహిళల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *