దావతే ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ
గ్రేటర్ న్యూస్,వరంగల్ : మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరంగల్ ఎల్బి నగర్లోని ఏ1 ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన దావతే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా పండ్లు అందజేశారు. అనంతరం ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… రంజాన్ పర్వదినం ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ ప్రతి వర్గానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొనియాడారు. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఇఫ్తార్ విందు వంటి కార్యక్రమాలు పరస్పర సౌహార్దాన్ని పెంపొందిస్తూ సమాజంలో ఐక్యతను బలపరుస్తాయని మంత్రి తెలిపారు. మత భేదాలు లేకుండా అందరూ కలిసి పండుగలను జరుపుకోవడం భారతీయ సంస్కృతికి ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈద్ పర్వదినం అందరికీ శాంతి, సౌభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందుకు కేటాయించిన నిధులను స్థానిక ఇమాములు, మౌజంలకు అందజేసి, అదేవిధంగా, తన స్వంత ఖర్చులతో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాజీ ఎంఎల్సీ కొండా మురళీధర్ రావు సోదరభావాన్ని చాటుకున్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఈద్గాహ్ల అభివృద్ధికి రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి కొండా సురేఖకు స్థానిక కార్పొరేటర్ ఫుర్ఖాన్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖోస్రో పాషా, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ఆర్డీవో సుమ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, డీపీఆర్వో ఆయుబ్ అలీ, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, ముస్లిం మత పెద్దలు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


