UGD నిధుల కేటాయింపుపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు..
గ్రేటర్ న్యూస్,హైదరాబాద్ : వరంగల్ త్రినగరాలు అయిన వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) నిర్మాణానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించిన నేపథ్యంలో ఆదివారం వరంగల్ ఎంపీ, ఎమ్మెల్యే లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్నికల సమయంలో త్రినగరాల అభివృద్ధి కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రూ.5257.20 కోట్ల భారీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ కడియం కావ్య ,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , రేవూరి ప్రకాష్ రెడ్డి , కేఆర్ నాగరాజు, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
నాడు ఎన్నికల్లో వరంగల్ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలని ముఖ్యమంత్రి ని కోరడం జరిగిందని నేడు నిధులు మంజూరు చేసి పనులకు పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.నాపై అమితమైన నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు నిలబెట్టుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.వరంగల్ నగర అభివృద్ధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ కీలకమైందని తెలిపారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించడం సంతోషకరమని పేర్కొన్నారు.జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక మౌలిక వసతులు అత్యవసరమని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అమలులోకి వస్తే నగరాల్లో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ప్రజలకు ఆరోగ్య పరిరక్షణలో కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వరంగల్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని, భవిష్యత్తులో నగరాన్ని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేసే దిశగా ఇది కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ…
వరంగల్ మహానగరానికి భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్టు మంజూరు చేయడం ద్వారా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కలను ముఖ్యమంత్రి నెరవేర్చారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ప్రధాన నగరంగా వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని ఎంపీ తెలిపారు. మౌలిక సదుపాయాలు, వైద్య, విద్య, రవాణా తదితర అన్ని రంగాల్లో వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని ఎంపీ అన్నారు. భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్టు అమలుతో నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు వరద ముంపు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వరంగల్ మహానగర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
వరంగల్‌ను రెండో రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను అమలు చేస్తున్నదని చెప్పారు. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, అలాగే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపనతో పాటు కాకతీయ టెక్స్‌టైల్ పరిశ్రమల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే వరంగల్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కొత్త దశకు చేరుకుంటుందని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

