గ్రేటర్ న్యూస్,హనుమకొండ : పేదలు ఇండ్ల స్థలాల కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని, పేదలు వేసుకున్న ఇండ్లకు ఇంటి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.శనివారం హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి కాలనీని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి లతో కలిసి సందర్శించారు. అనంతరం కాలనీ వాసుల సమావేశం సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ… ఇండ్ల స్థలాల కోసం, పక్కా ఇండ్ల నిర్మాణం కోసం ఏండ్ల తరబడి పేదలు పోరాడుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేందుకు స్థలం లేక, పక్కా ఇల్లు లేక, దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లస్థలంతో పాటు పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతున్న ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. పేదలకు, ప్రభుత్వ భూములలో గుడిసెలు, ఇండ్లు వేసుకుని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, గ్రామ పెద్దలు మాదసి కల్యాణ్, గాదె రాజన్న, గాదె మొగిలి, కట్కూరి కృష్ణ, నాయకులు పొనుగోటి రాముగోపాల్ చారి, పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, గుడికందుల శివ, మామునూరి దామోదర్, మాలోత్ మంగ, కోల్గూరి రాధిక, టి. మమత, వందలాది ఇండ్ల వాసులు తదితరులు పాల్గొన్నారు.

