డోల్బీ (అల్లు సినిమాస్ )ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి….
గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ :సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీగా ఎదగాలని ఆకాంక్షించారు.సినిమాలు మధ్య తరగతి వారిపై అత్యంత ప్రభావం చూపిస్తున్నాయని, జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, సామాజిక కోణంలో సినిమాలు అత్యంత ప్రభావం చూపిస్తాయని అన్నారు.హాలీవుడ్ సినిమాలను చూడటం కాకుండా మనం తీయగలిగే స్థాయికి ఎదగాలని కోరారు. ఇక్కడి సినిమా రంగం ఒక నాలెడ్జ్ హబ్‌గా ఎదగాలని, నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేసినప్పుడే గొప్పగొప్ప సినిమాలు తీయగలమని అన్నారు. తెలుగు సినిమా రంగం పాన్ ఇండియాతో కాకుండా హాలీవుడ్‌తో పోటీ పడాలన్నారు.సినిమా పరిశ్రమ అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు.అల్లు అరవింద్ కుటుంబం ఎంతో ఇష్టంతో నిర్మించిన ఈ డాల్బీ థియేటర్ తెలంగాణకు మంచి పేరు తెస్తుందని సీఎం ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఎమ్మెల్యే కుందూరు జయవీర్ , గీతా ఆర్ట్స్ అధినేత, సినీ నిర్మాత అల్లు అరవింద్ , తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు , నటుడు అల్లు అర్జున్ తో పాటు సినిమా రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.




