- నక్సలిజం నుంచి సైబర్ నేరాల వరకు పోలీసింగ్‌లో భారీ మార్పు: డీజీపీ సి.వి. ఆనంద్
- మౌలిక పోలీసింగ్‌పైనే ప్రధాన దృష్టి..
- డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి..
- గ్రేటర్ న్యూస్, వరంగల్ : ఒకప్పుడు నక్సలిజం పోలీసింగ్‌లో అతిపెద్ద సవాలైతే, ఇప్పుడు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, రోడ్డు భద్రత ప్రధాన సవాళ్లుగా మారాయని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరును ఆదివారం సమీక్షించిన ఆయన, పోలీసింగ్‌లో సాంకేతికత ఎంత కీలకమైనా మౌలిక పోలీసింగ్‌ను విస్మరించరాదని అధికారులకు సూచించారు.
- జిల్లాలోని ఎన్ఐటీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB), టీ-స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
- వరంగల్‌తో విడదీయరాని అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్‌లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ గుర్తుచేసుకున్నారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతి రోజు ప్రమాదకరంగా ఉండేదని ల్యాండ్‌మైన్ పేలుళ్లు, దాడుల మధ్య పోలీసులు విధులు నిర్వర్తించే వారమని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నేడు నెలకొన్న శాంతిభద్రతలు పోలీసు అమరుల త్యాగాల ఫలితమేనని పేర్కొన్నారు.
- సైబర్ మోసాలతో రూ.1,700 కోట్ల నష్టం…గత ఏడాది తెలంగాణలో సైబర్ నేరాల వల్ల ప్రజలు సుమారు రూ.1,700 కోట్లు కోల్పోయారని డీజీపీ వెల్లడించారు. మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేయకపోవడం వల్ల డబ్బు రికవరీ అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పారు. అధిక లాభాల పేరుతో జరిగే పెట్టుబడి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానం :
సైబర్ నేరాల నియంత్రణలో ప్రధానమంత్రి ప్రగతి సమీక్షలో తెలంగాణకు దేశంలోనే తొలి స్థానం లభించిందని డీజీపీ తెలిపారు. సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
మౌలిక పోలీసింగ్‌కే ప్రాధాన్యం :
సాంకేతికత పోలీసింగ్‌కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
యువత, చిన్నారులను లక్ష్యంగా డ్రగ్స్..
చాక్లెట్లు రూపంలో చిన్నారులను మాదకద్రవ్యాలకు అలవాటు చేసే ప్రయత్నాలు ఆందోళనకరమని డీజీపీ అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ నివారణలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
20 శాతం ఖాళీలతో కమిషనరేట్
వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజెంటేషన్‌లో కమిషనరేట్ పరిధిలో 50 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, 3,758 మంజూరైన పోస్టుల్లో 2,976 మంది మాత్రమే విధుల్లో ఉండగా 782 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. నేరాల నమోదు సుమారు 10 శాతం పెరిగినట్లు తెలిపారు.
రైళ్లలో వచ్చి నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలు బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చి వరంగల్, కాజీపేట కేంద్రంగా చైన్‌స్నాచింగ్, బైక్ చోరీలకు పాల్పడి వెంటనే వెళ్లిపోతున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ వివరించారు. NATGRID సహకారంతో సమాచార మార్పిడి, నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
నేను సైతం’కు డీజీపీ ప్రశంసలు :
ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. ముఖ్యంగా నల్లబెల్లి, పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన చర్యలను ప్రశంసించారు.
పెరుగుతున్న దోపిడీలు, సైబర్ కేసులు :
దోపిడీ కేసులు 7 నుంచి 18కు, తాజాగా 29కు పెరుగుదల.
సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కు, 2026 జనవరి-జూలైలోనే 119 కేసులు నమోదు.
ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదయ్యాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)కు సంబంధించిన 117 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను మరింత విస్తరించి ప్రజల భద్రతను బలోపేతం చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.




