మెకానికల్ థ్రాంబెక్టమీతో ప్రాణాపాయం నుంచి విముక్తి
గ్రేటర్ న్యూస్ , హనుమకొండ : స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతీ నిమిషం ఎంతో కీలకమని, సకాలంలో స్పందించి సరియైన వైద్యం అందిస్తే ప్రాణాపాయం తప్పడమే కాకుండా శాశ్వత వైకల్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చని ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ శివరామ్ రావు తెలిపారు.బుధవారం హనుమకొండ యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.”టైమ్ ఈజ్ బ్రెయిన్” అనే సూత్రాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో స్ట్రోక్ చికిత్సలో ‘మెకానికల్ థ్రాంబెక్టమీ’ విధానం ఒక పెద్ద విప్లవంగా మారిందని వైద్యులు వెల్లడించారు. మెదడుకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు, ప్రత్యేకమైన పరికరాల సహాయంతో క్యాథెటర్ ద్వారా ఆ గడ్డను సురక్షితంగా బయటకు తీస్తారు. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ వేగంగా పునరుద్ధరించబడుతుంది. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్న ఆధునిక బైప్లేన్ న్యూరోఇంటర్వెన్షనల్ క్యాథ్ ల్యాబ్ ద్వారా మెదడులోని
రక్తనాళాలను ఒకేసారి రెండు వేర్వేరు కోణాల్లో అత్యంత స్పష్టంగా చూడవచ్చు. దీనివలన క్లిష్టమైన న్యూరో చికిత్సలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించడానికి వీలవుతుందని వైద్య బృందం పేర్కొంది. ఇక్కడ బాధితుల అవసరానికి అనుగుణంగా మెకానికల్ థ్రాంబెక్టమీ, కారోటిడ్ స్టెంటింగ్, మెదడు అన్యూరిజం చికిత్స వంటి
అత్యాధునిక వైద్య విధానాలను అందిస్తున్నట్లు తెలిపారు. పక్షవాతం గుర్తింపు కోసం ప్రజలు BE-FAST నియమాన్ని గుర్తుంచుకోవాలని డాక్టర్ శివరామ్ రావు పిలుపునిచ్చారు. అకస్మాత్తుగా శరీర బ్యాలెన్స్ కోల్పోవడం, కంటి చూపు మందగించడం లేదా తగ్గడం, ముఖం ఒకవైపునకు వంగిపోవడం, చేయి లేదా కాలు హఠాత్తుగా
బలహీనపడటం, మాట తడబడటం లేదా సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోగిని అందుబాటులో ఉన్న అర్హత కలిగిన స్ట్రోక్ సెంటర్కు తీసుకువెళ్లడమే అత్యంత ముఖ్యమైన చర్య అని వైద్యులు స్పష్టం చేశారు. ఈ
కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ యు. రాజ్ కుమార్, స్వరాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

