Breaking
26 Mar 2026, Thu

అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు :మంత్రి పొంగులేటి…

జిల్లా అభివృద్ధి సమిష్టి గా కృషి చేయాలి

అధికారులంతా ప్రజలతో మమేకం కావాలి

99 రోజుల కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలి

గ్రేటర్ న్యూస్,వరంగల్/మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై మహబూబాబాద్ ఐడీఓసి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, శాసన సభ్యులు మురళి నాయక్, దొంతి మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి,
వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ చైర్పర్సన్స్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ….

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రధమ స్థానంలో ఉండేలా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రజలతో మమేకమై వారితో కలిసి పనిచేసి నప్పుడే సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు అవకాశం ఉందని సీఎం భావించి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, దీన్ని అమలు చేసే భాద్యత అధికారులదే అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి కొరత ఉండకుండా చూడాలని సూచించారు. ఉపయోగంలో లేని వైద్య పరికరాలను తొలగించి, అవసరమైన పరికరాలకు తగిన సిబ్బందిని నియమించి వాటిని సమర్థంగా వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు. పాఠశాలల వాహనాలు ఫిట్ నెస్ లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిపిఆర్ఎస్ ద్వారా పాఠశాల వాహనాలు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఎక్కడైనా నిధులు మంజూరు సమస్య ఉంటే నివేదికలు పంపాలని తెలిపారు. ప్రతి హస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి తనిఖీలు చేయాలని, విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాభితా తయారు చేయాలని తెలిపారు. మార్చి నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుండి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో పాత ఇల్లు ఉన్న ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చెస్తే ఆటంకాలు కలిగించొద్దని అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ, రెవెన్యూ భూ సమస్య పరిష్కారానికి సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు వేయాలని తెలిపారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో సమస్య బాగా ఉందని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న పాత రహదారుల అభివృద్ధికి ఆటంకాలను కలిగించొద్దని స్పష్టం చేశారు. భూ భారతిలో ఇచ్చిన పట్టాలు, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. భూ భారతిలో అక్రమాలు జరిగితే సహించేది లేదని తెలిపారు. కలెక్టర్ల, ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పెట్టొద్దని, రోడ్లు, కెనాల్, ఇతర అభివృద్ధి పనులకు భూ సేకరణ పూర్తి చేయాలని తెలిపారు.
వినియోగంలో లేని పాత భవనాలను తొలగించాలని, ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు తొలగించి నూతన భవనాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. వినియోగంలో ఉన్న భవనాలకు రంగులు వేయాలని తెలిపారు. అర్హులైన మహిళలను
మహిళ సంఘాలలో సభ్యులుగా చేర్చాలని తెలిపారు. మహిళల పధకాలకు సంబంధించి అన్ని పథకాలు ఈ 99 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక్కో ఎకో పార్కులు ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపారు.సమీక్ష సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు. మంచి ఉద్దేశంతో అమలు చేస్తున్న కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా అందనున్నాయని పేర్కొన్నారు.స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా సర్పంచులు, కార్యదర్శులు గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సెక్టార్ అధికారులను నియమించాలని కలెక్టర్లకు ఆదేశించారు. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఏవైనా చిన్న మార్పులు అవసరమైతే ప్రభుత్వం సూచనలు అందిస్తుందని తెలిపారు. జిల్లాల నుంచి అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందితే వాటికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ ఆలోచనలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు సమర్థంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచిస్తూ, కలెక్టర్లు, అధికారులు తమకు ఉన్న అవకాశాలను వినియోగించి ప్రజలకు మంచి చేయాలనే తపనతో సేవ చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు, డిఎఫ్ ఓ లు, ఆదనవు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *