హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశం…
గ్రేటర్ న్యూస్,హనుమకొండ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధిపథంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ( దిశా) సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో గత దిశా సమావేశంలో నిర్ణయించిన అంశాలపై తీసుకున్న చర్యలు, మహిళా శిశు సంక్షేమ, జిల్లా వైద్య ఆరోగ్య, విద్యా, వ్యవసాయ గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య, నీటిపారుదల, గనులు, భూగర్భ జల, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, జిల్లా ముఖ్య ప్రణాళిక తదితర శాఖలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, వాటి పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో దిశా కమిటీ ఛైర్ పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ….
ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ పై దృష్టి సారించాలని అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచాలన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. హనుమకొండ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంతవరకు స్నాక్స్ అందజేయాలన్నారు. గర్ల్స్ హాస్టల్ ను తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. పీఎం సూర్య ఘర్ సోలార్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని, వాటిని ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరాయంగా సోలార్ విద్యుత్ ను అందజేయవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ ఉండాలనేది ఎంతో ముఖ్యమని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో వైద్య ఆరోగ్య సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జి- రామ్ జీ పథకం గైడ్లైన్స్ గురించి తెలియజేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు నివారణకు చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. రోడ్లపై చాలా చోట్ల విద్యుత్ దీపాలు లేవని, వెంటనే అమర్చాలని అన్నారు. వచ్చే దిశా సమావేశానికి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులపై సమగ్ర వివరాలతో హాజరుకావాలని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ…
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ స్థాయిలో ఉందని అన్నారు. జిల్లాలతో పోల్చుకున్నట్లయితే జిల్లా ప్రగతి తక్కువగా ఉందన్నారు. జిల్లా లో ప్రీ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్రోల్మెంట్ మీద అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల నమోదును చేపట్టాలన్నారు. ప్రీ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కలెక్టర్ కు అందజేయాలన్నారు. బాలికల పాఠశాలలో టాయిలెట్స్ లేవని, వాటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలకు ఉన్న ప్రారంభానికి నాటికి ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని అధికారులకు తెలియజేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 21 ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ పరికరాలను ఇచ్చానని, డిజిటల్ బోధన సాగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ తదితర సమస్యలను పరిష్కరించని అధికారులపై చర్యలు చేపట్టాలని అన్నారు. పిల్లలకు టీకాలు ఇచ్చే విషయంలో తక్కువ శాతంఉందని, దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వంద శాతం టీకాలు ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు ఇంకా ప్రారంభం కాలేదన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ…
వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. వరంగల్ చౌరస్తా ప్రాంతంలో డ్రైనేజి సమస్య పరిష్కరించాలని అన్నారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…
జిల్లాలో 400లకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని 18వేలమంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని విద్యార్థుల ప్రవేశాల నమోదును పెంచాలని, మండలానికి ఇన్చార్జి అధికారిని నియమించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విద్యార్థుల ప్రవేశాలను పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మొక్కుబడి గా కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచి చూపించాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా, మౌలిక వసతులను కల్పిస్తూ మంచి ఫలితాలు సాధించే విధంగా కలెక్టర్ డీఈవో కృషి చేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజులపాటు నిర్వహించే కార్యకరణ ప్రణాళికలో ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్, టాయిలెట్స్, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రెడ్కో అధికారులు చర్యలు చేపట్టాలని, ఆన్నారు. టాయిలెట్స్ లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి ఆ జాబితాను అందిస్తే వాటి నిర్మాణానికి నిధులను కేటాయిస్తామన్నారు.
మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతులను కల్పించేందుకు అంచనాలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కోసం
నియోజకవర్గానికి 16 కోట్ల రూపాయలను మంజూరు చేశారని పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాని సంబంధిత శాఖల అధికారులపై నోటీసులు ఇవ్వాలన్నారు. ఎక్కడ కూడా పంటలు ఎండిపోకుండా దేవాదుల ద్వారా నీరు అందించేందుకు సగం నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మార్చి నెల లో వరి, మొక్కజొన్న పంటలకు నీరు ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం ఉంచి ఒక ఎకరం కూడా ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ….
ప్రభుత్వ పాఠశాలలకు సోలార్ సదుపాయాన్ని కల్పించాలని, ఆ దిశగా అధికారుల చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాఠశాలల్లో హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని అన్నారు. సిపిఆర్ పై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల స్థాయిలో హార్ట్ ఎటాక్ లు వస్తున్న దృష్ట్యా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. మడికొండ డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రంగా ఉందని, అదేవిధంగా హసన్ పర్తి టౌన్ లో తాగునీటి సమస్య ఉందని వాటికి పరిష్కార చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సంబంధిత అధికారులకు సూచించారు. హసన్ పర్తి, బొల్లికుంట మార్గాలలో రోడ్డు ప్రమాదాల కారణంగా విద్యార్థులు యువత మరణిస్తున్నారని, చాలా బాధేస్తుందని అన్నారు. ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…
శాయంపేట మండలం పెద్దకోడెపాకలోని ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేవని అన్నారు. పాఠశాలల్లో తాగునీరు, కరెంటు, టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్స్, కరెంటు, తదితర మౌనిక వసతులు కల్పించేందుకు కావలసిన నిధులను కేటాయించాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ను కోరారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో అదనపు గదులు లేవని, కిచెన్ షెడ్ లేదని, నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిని పాఠశాల ఇంజనీరింగ్ శాఖ అధికారులు త్వరగా పరిష్కరించాలని అన్నారు. నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారాన్ని అందజేయాలన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ….
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పనుల పురోగతి కొరకు అధికారులంతా సమిష్టిగా పనిచేస్తూ ప్రగతి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.
జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లీకేజీ సమస్యలను ఎప్పటికప్పుడు అరికడుతూ ఆయా డివిజన్లో ఏఈల ద్వారా తాగునీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఫిల్టర్ బెడ్లలో చేపట్టిన మరమ్మతులు ఈ నెల 31 తేదీ వరకు పూర్తి చేస్తామన్నారు.
సమావేశం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బాలికలకు వేసే హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం, అదేవిధంగా టీజీ రెడ్కో ఆధ్వర్యంలో తయారుచేసిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకానికి సంబంధించిన పోస్టర్లను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, కలెక్టర్, తదితరులు ఆవిష్కరించారు.
ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రవి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



