వచ్చే 45 రోజుల్లోగా రైతులందరి ఖాతాలలో 9 వేల కోట్లు…
గ్రేటర్ న్యూస్, సిద్దిపేట : రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయం “రైతు భరోసా” నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి నిధులను విడుదల చేశారు. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయని, వచ్చే 45 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలు రైతులందరి ఖాతాల్లో నిధులు చేరిపోతాయని సీఎం చెప్పారు.
✅ సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో కేవలం 17 నెలల కాలంలో పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో రూ. 775 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో మరికొన్ని కొత్త పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….
✅ రైతును రాజును చేయడానికి వ్యవసాయ రంగంలో పంటల మార్పిడి విధానం రావాలని అభిప్రాయపడ్డారు. పశ్చిమాషియా యుద్ధం వల్ల గ్యాస్, యూరియాలకు కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
✅ “వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడం కోసం పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉందని అందుకు సంబంధించి సరైన ప్రణాళికలు తయారు చేయాలన్నారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు లాభసాటిగా ఎలా మార్చాలన్న విషయాలపై ప్రణాళికలు సిద్ధం కావాలని సీఎం తెలిపారు.
✅ పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో యూరియా, గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని సూచించారు.తెలంగాణలోని రామగుండంలో ఉత్పత్తి చేస్తున్న యూరియా మన రాష్ట్రానికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలన్నారు.
✅ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నేతృత్వంలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకారంతో రాష్ట్రానికి అత్యధికంగా యూరియా కేటాయించేలా కోరాలని ప్రస్తుత పరిస్థితుల్లో నానో యూరియా కూడా వినియోగం పెంచుకోవాలన్నారు.
✅ రాష్ట్రంలో ప్రాంతాల వారిగా రకరకాల పంటలు పండుతున్నాయని పంట మార్పిడి విధానాలు రావాలి రైతులను ప్రోత్సహించాలన్నారు.పండించిన పంటలకు మరింత లాభం రావాలంటే వ్యవసాయంలో మార్పు రావాలని రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
✅ ఈ ఏడాది 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని సన్నబియ్యం పంపిణీ చేయడంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసినప్పటికీ ఇంకా మిగిలిపోతున్నాయన్నారు . చిన్న రాష్ట్రమైనప్పటికీ ఈ ఏడాది 2.58 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచామని అన్నారు.
✅ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ 10 లక్షల ఎకరాల్లో పండించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయిల్ పామ్ లాంటి కర్మాగారాలు వచ్చి వ్యవసాయం లాభసాటిగా మారితే రైతుల పిల్లలు చదువుకోవడానికి, ఇళ్లు కట్టుకోవడానికో ఎవరినీ చేయి చాచాల్సిన అవసరం రాదని తెలిపారు.
✅ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని రాష్ట్రంలోని 12,728 గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని లాభసాటి పంటలు పండించే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
✅ నర్మెట్టలో నిర్మించినట్టుగానే కొడంగల్ నియోజకవర్గంలోనూ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జిల్లా ఇంచార్జీ మంత్రి దామోదర్ రాజనర్సింహ , ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకోవాలని సూచించారు.
✅ గత ప్రభుత్వ హయాం 114 నెలల కాలంలో రైతు సంక్షేమం కోసం సగటున ప్రతి నెల 2,533 కోట్లు ఖర్చు చేస్తే, ప్రజా ప్రభుత్వం గడిచిన 28 నెలల కాలంలో ప్రతి నెల 5,500 కోట్లు ఖర్చు చేసింది. రైతుల కోసం ఉచిత కరెంట్, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, బీమా, అకాల వర్షాలొచ్చినప్పుడు పంట నష్టపరిహారం… మొత్తంగా రూ. 1.30 లక్షల కోట్లను ఖర్చు చేసి రైతు రాజ్యంగా కొనసాగిస్తున్నమన్నారు.
✅ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల మధ్య సమన్వయం ఉండాలని అభివృద్ధి కార్యక్రమాలను కలిసికట్టుగా సాధించుకుందమన్నారు.ప్రజా ప్రభుత్వం ఏ నియోజకవర్గాల పట్ల వివక్ష చూపదు” అని స్పష్టం చేశారు. నర్మెట్టలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల ద్వారా రైతులు వీక్షించారు.
✅ ప్రజాపాలన – రైతు ఉత్సవాల్లో భాగంగా సాగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , దామోదర రాజనర్సింహ , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , వివేక్ వెంకటస్వామి , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , రఘునందన్ రావు తో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






