క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సాంకేతికత…
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : క్యాన్సర్ రోగుల చికిత్సలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యశోద హాస్పిటల్స్ సరికొత్త విప్లవాత్మక సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. వృద్ధులు, తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న క్లిష్టమైన క్యాన్సర్ రోగుల కోసం
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ‘ఎంఆర్-లినాక్’ యంత్రం ద్వారా ‘హైపోఫ్రాక్షనేటెడ్ అడాప్టివ్ రేడియేషన్ థెరపీ’ (హైపో-ఆర్ట్) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో వయసు పైబడిన వారిలో లేదా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో ముదిరిన క్యాన్సర్ కణితులకు చికిత్స చేయడం వైద్యులకు పెద్ద
సవాలుగా ఉండేది. సాంప్రదాయ రేడియేషన్ పద్ధతుల్లో ఎక్కువ రోజులు చికిత్స అందించాల్సి రావడం, దానివల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురుకావడం వంటి ఇబ్బందులు ఉండేవి. అయితే, ప్రస్తుత ‘హైపో
ఆర్ట్’ విధానం ఇలాంటి క్లిష్టమైన రోగులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సరికొత్త చికిత్సా
విధానం గురించి మంగళవారం హనుమకొండ యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కారుమంచి మాట్లాడుతూ.. “వయస్సు పైబడటం లేదా ఇతర సంక్లిష్ట వైద్య చరిత్రలు ఉన్నప్పటికీ ఇప్పుడు క్యాన్సర్కు అత్యంత సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.ఈ హైపో-ఆర్ట్ విధానం ద్వారా ప్రతి సెషన్ లోనూ క్యాన్సర్ కణితిపై
అత్యంత ఖచ్చితత్వంతో కూడిన శక్తివంతమైన రేడియేషన్ మోతాదును అందించవచ్చని దీనివల్ల చికిత్స తీసుకోవాల్సిన రోజుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికత వల్ల రోగులు పదేపదే ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఫలితంగా వృద్ధ రోగులకు శారీరక శ్రమ, చికిత్స తాలూకు అలసట చాలా వరకు తగ్గుతాయి. ఈ చికిత్సను మరింత సురక్షితంగా, ఖచ్చితత్వంతో అందించడానికి డాక్టర్ కారుమంచి నేతృత్వంలోని వైద్య బృందం హై-ఫీల్డ్ ఎంఆర్ఐ స్కానర్ కలిగిన అత్యాధునిక ఎంఆర్- లినాక్ యంత్రాన్ని ఉపయోగిస్తోంది. ఈ విధానం క్యాన్సర్ బాధితుల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోందన్నారు. ఈ సమావేశంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

