Breaking
16 Jul 2026, Thu

వడదెబ్బ ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి

గ్రేటర్ న్యూస్, వరంగల్ : తెలంగాణలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పులకొలిమిలా మారింది. భూపాలపల్లిలో వడదెబ్బతో ఒక్కరోజే నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

రేగొండ మండలం భాగిర్తిపేటకు చెందిన యాకూబ్‌(45), మొగుళ్లపల్లి మండలం పోతుగల్లుకు చెందిన సక్కమ్మ(59), చిట్యాల మండలం చల్లగరిగేకు చెందిన పోషయ్య, కాటారం మండలం శంకరంపల్లికి చెందిన సమ్మక్క(65) వడదెబ్బ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 22 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొమ్మిది మంది వడదెబ్బ బారినపడి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి. తీవ్రమైన ఎండలతో చిన్నపిల్లలు, వృద్ధులు, బయట పనులు చేసే కార్మికులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరమని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *