25 Feb 2026, Wed

మేడారంపై పోలీసుల డేగ కన్ను….

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క

450 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా….

గ్రేటర్ న్యూస్, ములుగు / మేడారం : మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా శాంతి భద్రతల ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించి, అక్కడి నుంచి కొనసాగుతున్న భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.జాతర ప్రాంతం అంతటా సుమారు 450 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై జాతర ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలు, భక్తుల రాకపోకలు, జనసాంద్రత పరిస్థితులను మంత్రి సీతక్క ప్రత్యక్షంగా వీక్షించారు.ఈ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులు ఎలా స్పందిస్తారు, ముందస్తు చర్యలు, సన్నాహాలు ఏమిటన్న అంశాలను పోలీస్‌ అధికారులు మంత్రికి వివరించారు.భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతి చిన్న అంశాన్ని కూడా అప్రమత్తతతో పర్యవేక్షించాలని మంత్రి సీతక్క పోలీస్‌ అధికారులకు స్పష్టంగా ఆదేశించారు.భక్తులు నిర్భయంగా, ప్రశాంతంగా జాతరలో పాల్గొనేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలని, పోలీస్‌ యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ దివాకర టీ.ఎస్., జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *