గ్రేటర్ న్యూస్, వరంగల్ : హనుమకొండ–వరంగల్ జంట నగరాల్లో అబ్రాడ్ కన్సల్టెన్సీ రంగానికి చెందిన నిర్వాహకులు ఐక్యతకు నాంది పలుకుతూ ఓరుగల్లు కన్సల్టెన్సీ అసోసియేషన్ను స్థాపించారు. అసోసియేషన్ అధికారిక లోగోను శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. విదేశీ విద్య, ఇమిగ్రేషన్ సేవలను మరింత పారదర్శకంగా, నాణ్యంగా అందించాలనే లక్ష్యంతో ఈ సంఘం ఏర్పడటం విశేషంగా నిలిచింది.హనుమకొండ, వరంగల్ నగరాల్లో సేవలందిస్తున్న పలు కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు ఒక వేదికపైకి వచ్చి ఈ అసోసియేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ… విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించడం ఎంతో కీలకమని, ఇలాంటి సంఘాలు ఏర్పడటం ద్వారా విద్యార్థులు మోసాలకు గురికాకుండా నమ్మకమైన సేవలు పొందగలరని తెలిపారు. కన్సల్టెన్సీల మధ్య పరస్పర సహకారం పెరగడం ద్వారా రంగానికి మంచి గుర్తింపు వస్తుందని అభినందించారు.అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ…విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ, నైతిక ప్రమాణాల పాటింపు, సేవల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సంఘం ద్వారా అబ్రాడ్ కన్సల్టెన్సీ రంగంలో కొత్త దిశ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులైన డాక్టర్ ఆడెపు మధుసూదన్, బండారి మనోజ్, సిద్దోజు నితీష్, గోదాసి శివ, దాసి వినయ్, భరద్వాజ్ నేత పాల్గొన్నారు.

