ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా…
ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని,అన్నదాతకు అండగా నిలిచే ప్రభుత్వమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం -వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో రైతులను ఉద్దేశించి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ మెగా రైతు మేళాకు భారీగా తరలివచ్చిన రైతులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీపై అందజేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రూ.2 లక్షల పంట రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్, ఎకరాకు రూ.12,000 రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 25 లక్షల మంది రైతన్నలకు 21 వేల కోట్లకుపైగా రైతులకు ప్రభుత్వం రుణమాఫీ సహాయాన్ని అందించి అండగా నిలిచినట్లు పేర్కొన్నారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి “భూభారతి” వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ప్రభుత్వం ప్రజల మధ్యకే వెళ్లి, గ్రామాలు, వార్డుల స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తోందన్నారు. అదే కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలు, మెగా రైతు మేళాలు నిర్వహిస్తూ రైతులకు నూతన సాంకేతికతను పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు.
రైతుల దీవెనలతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు లక్షలాది మంది రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ చేసి అండగా నిలిచినట్లు మంత్రి తెలిపారు. రైతును రాజుగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదగడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలే కారణమని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా రైతుల సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వం రైతుల వెంటే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. “రైతు బలంగా ఉంటేనే రాష్ట్రం బలపడుతుంది. రైతు ఆనందం – ప్రభుత్వ ఆనందం” అని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తూ, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సంక్షేమానికి, ప్రాజెక్టుల గురించి కృషి చేశారని, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. గతేడాది అత్యధిక వరి పండిన రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు సంక్షేమం కోసం క్యాబినెట్లో విస్తృత చర్చ జరిగిందన్నారు. పంటల సాగులో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలని రైతులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిరుపేదలు బాగుపడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా పరిపాలన చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ…
రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరితపిస్తున్నారని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు వరంగల్ వేదికగా మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను నిర్వహిస్తున్నారని అన్నారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేశారని అన్నారు. వరి పండించిన రైతులకు బోనస్ గా 500 రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్నారని అన్నారు. రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయం చేస్తేనే కాదు రైతులు సంతోషంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటును ధరను కల్పించి ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రాజ్య ప్రభుత్వమని అన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని చేసుకునే విధంగా సబ్సిడీ యంత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్టాల్స్ లో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ సంబంధిత అంశాల గురించి రైతులు తెలుసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ…
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీ చేయడం గొప్ప విషయం అన్నారు. రైతు భరోసా, రైతు బీమా పథకాలను అందిస్తున్నారని అన్నారు. వ్యవసాయ పనిముట్లకు 50% సబ్సిడీ ఇస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో ఆధునిక పంటల సాగు విధానం గురించి రైతులు తెలుసుకోవాలని, అదేవిధంగా పంటల మార్పిడి చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ చేయూతగా నిలుస్తుందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు ఈ మెగా రైతు మేళాను నిర్వహిస్తుందని తెలిపారు. భూసార పరీక్షలు, ఇతర రైతు సంబంధిత అంశాలను తెలియజేశారు.
ఈ సమావేశంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు పత్రాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, తదితరుల చేతుల మీదుగా అందజేశారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సభాధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో స్టేషన్ ఘన్పూర్, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిత్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానసరాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, అధికారులు
రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా నిర్వహిస్తున్న హనుమకొండ లోని ఆర్ట్స్ కళాశాల మైదానం వద్దకు చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ ఎమ్మెల్యేలకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మెగా రైతు మేళా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, హాకా మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారులు రవీందర్ సింగ్, రాజమణి, ఉద్యాన శాఖ అధికారి అనసూయ, తదితరులు ఉన్నారు.
స్టాల్స్ ను పరిశీలించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు
హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన దాదాపు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఈ స్టాల్స్‌ను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు తదితరులు సందర్శించి పరిశీలించారు. స్టాల్స్‌లో ప్రదర్శించిన ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యంత్ర పరికరాలపై అధికారులు వివరాలు అందించారు.
రైతులు స్టాల్స్‌ను ఆసక్తిగా సందర్శిస్తూ, కొత్త సాంకేతికతలు, పథకాలపై సమాచారం తెలుసుకుంటూ ఆకర్షితులయ్యారు.










