Breaking
16 Jul 2026, Thu

మంగ్లీ సోదరుడి అకౌంట్ కు డబ్బులు..!

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మైక్రో ఫైనాన్స్‌ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్‌ అకౌంట్‌కు నిందితుడు రమావత్‌ మధు నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా రమావత్ మధు అకౌంట్‌ను పరిశీలించగా.. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్‌ అకౌంట్‌కు డబ్బులు పంపినట్లు తేలింది. మూడుసార్లు నగదు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు పడిన రోజే ఖాతా నుంచి విత్‌ డ్రా చేసినట్లు నిర్ధారించారు. అయితే, ఎంత మేర నగదు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందో అధికారులు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు రమావత్‌ మధు అకౌంట్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) సీజ్ చేసింది. రమావత్‌ మధు, హిమకాంత్‌రెడ్డి, శివ చౌహాన్‌కు చెందిన అకౌంట్ల పూర్తి వివరాలను ఇవ్వాలని సంబంధిత బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తమ పేర్లను అనవసరంగా లాగుతున్నారని మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ ఆరోపిస్తున్నారు. కాగా, నిందితుడు రమావత్ మధు.. అధిక వడ్డీ పేరుతో వేల మంది నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *