Breaking
16 Jul 2026, Thu

కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ…..వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్:మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం అని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయం లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని,
నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగాలని, మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో చీరల పంపిణీ చేపట్టాలని సూచించారు. పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని,
గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వాటికి మహిళలను యజమానులను చేశామని, స్కూల్ యూనిఫారంలు కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని, ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *