Breaking
30 Aug 2026, Sun

ఎల్‌పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు.. బుకింగ్‌పై వదంతులు నమ్మొద్దు: పెట్రోలియం శాఖ

గ్రేటర్ న్యూస్, ఢిల్లీ : ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును మార్చారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన, తప్పుదోవ పట్టించే కథనాలని స్పష్టం చేసింది. ఎల్‌పీజీ కనెక్షన్లకు సంబంధించి రీఫిల్ బుకింగ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ (MoPNG) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు 45 రోజులు, ఇతరులకు 25 నుంచి 35 రోజుల గడువు విధించినట్టు ప్రచారం జరిగింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే రీఫిల్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత వినియోగదారులు మరో సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అనవసరంగా ఆందోళనతో సిలిండర్లను బుక్ చేసుకోవద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. దేశవ్యాప్తంగా సరిపడా ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. దేశంలోని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) కూడా ఖండించింది.

ఇరాన్ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చమురు, గ్యాస్, సరఫరా వ్యవస్థలపై దృష్టి సారించేందుకు కేంద్రం ఏడు ఉన్నతస్థాయి బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *