46వేల మంది జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు…
గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ జర్నలిస్టులకు ఎక్కువ మొత్తంలో అక్రిడేషన్ కార్డులు అందజేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం హిమాయత్ నగర్ లోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులకు నూతన అక్రిడేషన్ కార్డులను మంత్రి పొంగులేటి ప్రారంభించి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ….గత ప్రభుత్వంలో 23,532 మందికి అక్రిడేషన్ కార్డులను పంపిణీ చేస్తే ప్రజాప్రభుత్వంలో సుమారు 46 మందికి పైగా జర్నలిస్టులకు కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.జర్నలిస్టుల గుర్తింపు కేవలం కార్డుల జారీ వరకే పరిమితం కాకుండా వారికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు.పారదర్శకమైన విధానాలను పకడ్బందీగా రూపొందించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. నూతన కార్డుల జారీలో కాస్త ఆలస్యం జరిగినా పారదర్శకమైన విధానాలను అవలంబించడానికే ప్రాధాన్యమిచ్చామని తెలిపారు.

- ఏప్రిల్ 30తో పాత కార్డుల గడువు ముగిసిన నేపథ్యంలో జర్నలిస్టులకు ఇబ్బంది కలగకుండా నూతన కార్డుల జారీని ప్రజాప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు నుంచే జిల్లాల్లో కూడా అర్హులైన ప్రతి జర్నలిస్టులకు కార్డులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించడం జరిగింది.నిర్ణీత వ్యవధిలో అక్రిడేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేసి, కార్డు పొందిన జర్నలిస్టుల సంఖ్య ఫైనల్ చేసిన తరువాత వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సానుకూల నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది.ఒక సంస్థ నుండి అక్రిడేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు, ఆ సంస్థ నుంచి మరో సంస్థకు వెళ్లినప్పుడు వారు తమ కార్డును రిప్లేస్మెంట్ చేసుకునే నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్ , ఎమ్మెల్సీ అంజిరెడ్డి , మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి , సమాచార శాఖ కమీషనర్ ముకుందరెడ్డి , అక్రిడేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.


