Breaking
19 Apr 2026, Sun

సురక్షిత ప్రయాణాల కొరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం : అడిషనల్ డీజీపీ చారు సిన్హా

అరైవ్ అలైవ్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం :రోడ్డు ప్రమాదాల బారీన పడకుండా ఉండేందుకు వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించడమే “అరైవ్ అలైవ్” కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ), ఉమెన్ సేఫ్టీ వింగ్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ చారు సిన్హా తెలిపారు.

గురువారం హనుమకొండ జిల్లా భీమారం పరిధిలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో వరంగల్ పోలీస్ కమిషనరేట్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతపై “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డీజీపీ చారు సిన్హా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టర్ లు, చాహత్ బాజ్ పాయ్,డాక్టర్ సత్య శారద తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమం ప్రారంభంలో రోడ్డు ప్రమాదాల కారణాలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వీడియోలు, స్కిట్లు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా రుత్విక్ అనే బాలుడు తన తండ్రి హెల్మెట్ ధరించకపోవడంతో జరిగిన ప్రమాదంలో మరణించారని చెప్పి అందరిని ఆలోచింపజేశాడు.

ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ..

“అరైవ్ అలైవ్” కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకుని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సురక్షిత ప్రయాణం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలను బాధ్యతగా పాటిస్తే మనం మాత్రమే కాకుండా ఇతరులు కూడా సురక్షితంగా ఉంటారని పేర్కొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న విషయాలను అడగగా, రుత్విక్‌తో పాటు పలువురు విద్యార్థులు, యువకులు స్పందిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటించడం, ఓవర్‌టేకింగ్ చేయకపోవడం, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం వంటి అంశాలను తెలుసుకున్నామని తెలిపారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13న “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ప్రారంభించామని, 18వ తేదీ వరకు ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ

వారం రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, డ్రైవర్లకు కళ్లద్దాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. పాఠశాలలు, మండల విద్యాధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు.
మెడికల్ క్యాంపులు, హ్యూమన్ చైన్‌లు, పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాటు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్నచిన్న జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

జిల్లా రవాణాశాఖ అధికారి సురేష్ రెడ్డి మాట్లాడుతూ

ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా కూడా రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ సందర్భంగా సురక్షిత రోడ్డు ప్రయాణం కోసం నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీల నిర్వహించగా ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను బహూకరించారు.

పలువురు ద్విచక్ర వాహనదారులకు అతిధుల చేతుల మీదుగా హెల్మెట్లను పంపిణీ చేశారు.రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని కార్యక్రమానికి హాజరైన వాహనదారులు, బస్సు డ్రైవర్లు, సర్పంచులు, ప్రజలతో ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు.సురక్షిత డ్రైవింగ్‌కు ఆదర్శంగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా డ్రైవర్లకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసి సత్కరించారు

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని కార్యక్రమానికి హాజరైన వాహనదారులు, బస్సు డ్రైవర్లు, సర్పంచులు, ప్రజలతో ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు.

సురక్షిత డ్రైవింగ్‌కు ఆదర్శంగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా డ్రైవర్లకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసి సత్కరించారు

ఈ కార్యక్రమంలో డిసిపిలు ధార కవిత, అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పి శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎంవిఐలు వేణుగోపాల్, శోభన్ బాబు, కిషోర్ బాబు, ఇతర అధికారులు, వివిధ సంస్థల వాహనాల డ్రైవర్లు, ప్రజలు సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *