Breaking
31 May 2026, Sun

పనివాళ్లుగా ఇంట్లోకి.. కోట్లు కొల్లగొట్టి పరార్..

హైదరాబాద్‌ను వణికిస్తున్న నేపాలీ ముఠాల ‘ఆపరేషన్ దోపిడీ’

గ్రేటర్ న్యూస్,హైదరాబాద్, మే 9 : హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు, భారీ దోపిడీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పనివాళ్లుగా చేరుతున్న నేపాలీ ముఠాలు కోట్ల రూపాయల నగదు, బంగారాన్ని దోచుకుని పరారవుతున్న తీరు నగరవాసుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ ఘటనల వెనుక నేపాల్ కేంద్రంగా పనిచేస్తున్న మాస్టర్ మైండ్ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫిబ్రవరి 6న నందగిరి హిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో పని చేస్తున్న భూపిందర్ షా అనే నేపాలీ యువకుడు, ఇంట్లోని ఇతర పనివారికి మత్తుమందు ఇచ్చి దాదాపు రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. అనంతరం మార్చి 14న జూబ్లీహిల్స్‌లో మరో వ్యాపారి ఇంట్లో పనిచేసే ఇద్దరు నేపాలీలు, యజమాని ఇంట్లో లేని సమయంలో లాకర్లు పగలగొట్టి రూ.3 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. తాజాగా మే 8న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ యువతి, యజమాని భార్యను హత్య చేసి నగదు, నగలతో పరారవడం సంచలనంగా మారింది. ఈ మూడు ఘటనల తీరు ఒకే ముఠా పనితీరును తలపిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

పక్కా ప్లాన్‌తో దోపిడీలు

నిందితులు ముందుగా ధనిక కుటుంబాలను టార్గెట్‌గా ఎంచుకుని పనిమనుషులుగా ఇళ్లలో చేరుతున్నారు. కొన్ని వారాల పాటు నమ్మకంగా పనిచేస్తూ కుటుంబ సభ్యుల అలవాట్లు, ఇంట్లోని భద్రతా పరిస్థితులు, నగదు మరియు నగలు ఎక్కడ ఉంచుతారనే వివరాలను గమనిస్తున్నారు. సరైన సమయం కోసం వేచి చూసి, యజమానులు బయటకు వెళ్లినప్పుడు లేదా అప్రమత్తంగా లేని సమయంలో తమ అనుచరులతో కలిసి దోపిడీలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నేపాల్ నుంచి మాస్టర్ ప్లాన్!

అరెస్టయిన నిందితులను విచారించగా ఈ దోపిడీల వెనుక నేపాల్‌లో ఉన్న కొందరు కీలక వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పనికి వెళ్లే వ్యక్తుల ఎంపిక నుంచి, దోపిడీ తర్వాత ఎలా తప్పించుకోవాలనే మార్గదర్శకాలు కూడా వారే ఇస్తున్నట్లు సమాచారం. దోచుకున్న సొత్తుతో వెంటనే పుణె, ముంబై వంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి నేపాల్ చేరేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులకు కొత్త సవాల్

గతంలో నగర పోలీసులను ఇబ్బందులకు గురి చేసిన రాజస్థాన్‌కు చెందిన ‘ముఖియా గ్యాంగ్’ తరహాలో ఇప్పుడు ఈ నేపాలీ ముఠాలు కొత్త సవాల్‌గా మారాయి. అయితే, ఈ కేసులు అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండటంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు క్లిష్టంగా మారింది. నిందితులు నేపాల్‌కు పారిపోతే వారిని తిరిగి భారత్‌కు తీసుకురావడం న్యాయపరమైన ఒప్పందాల కారణంగా సంక్లిష్టమవుతోంది.

అయినప్పటికీ, ఈ ముఠాలను పూర్తిగా అణిచివేయడానికి నగర పోలీసులు ‘ఆపరేషన్ నేపాల్’ పేరుతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గత ఘటనల్లో పాల్గొన్న అనుమానితుల వివరాలను సేకరిస్తూ, రాష్ట్రాల మధ్య సమన్వయంతో దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *